విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివారం ఉదయం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కోండ్రు అఖిల (18) అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
అఖిల ఇంటి వద్ద ఉన్న సమయంలో మంకీ క్యాప్ ధరించి వచ్చిన వ్యక్తి, ఆమెపై అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అఖిల కేకలతో అక్కడివారు వచ్చేసరికి ఆ దుండగుడు పరారయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక వైద్యం అనంతరం మెరుగైన చికిత్స కోసం అఖిలను విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. దుండగుడు పరారీలో ఉండగా, అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఈ దాడికి కారణాలు తెలియాల్సి ఉంది. వ్యక్తిగత వ్యతిరేకతా? లేక ఇతర కోణముందా? అన్నది పోలీసు దర్యాప్తులో తేలనుంది. గ్రామస్తులు భయాందోళనకు గురవుతుండగా, పోలీసులు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.