Karregutta Forest Blast: ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 మంది భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో 10 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు, ఒకరు కోబ్రా బెటాలియన్‌కు చెందిన అధికారి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన కర్రెగుట్టల అడవులు గతంలో మావోయిస్టుల బలమైన స్థావరాలుగా ఉండేవి. తమ రక్షణ కోసం అప్పట్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున ఐఈడీలు, మందుపాతరలు అమర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ‘ఆపరేషన్ కగార్’ పేరుతో భద్రతా బలగాలు విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
రిపబ్లిక్ డే సందర్భంగా గాలింపు చర్యలు కొనసాగుతున్న సమయంలో ఒకదాని తర్వాత మరో ఐఈడీ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన అనంతరం అప్రమత్తమైన భద్రతా బలగాలు మరో రెండు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఇప్పటికే కర్రెగుట్ట ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
also read:ఉత్తరాఖండ్‌లో సంచలన నిర్ణయం.. గంగోత్రి ధామ్‌లో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం








