హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ గ్రూప్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఇండియా (SAESI) యూనిట్‌ను జీఎంఆర్ ఎయిరోపార్క్ SEZలో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
హైదరాబాద్ ఇప్పటికే దేశంలో ప్రముఖ ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బెంగుళూరు–హైదరాబాద్‌ను అధికారిక డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సాఫ్రన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్‌ను పరిశోధన, తయారీ, MRO కార్యకలాపాల కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర సామర్థ్యాన్ని చాటుతోందని అన్నారు.

సాఫ్రన్ ఫెసిలిటీలో ఎం88 మిలిటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హాల్ సేవలు అందించబడతాయి. ప్రారంభ పెట్టుబడి రూ.1300 కోట్లతో ఏర్పడిన ఈ కేంద్రం ద్వారా వెయ్యికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులకు ఉపాధి లభించనుంది.
ఎస్ఎంఈ విధానం, ఎయిరోస్పేస్ పార్కులు, SEZలు పెట్టుబడుల వృద్ధికి దోహదపడ్డాయని ప్రభుత్వం పేర్కొంది. గతేడాది ఎయిరోస్పేస్ ఎగుమతులు రెండింతలు పెరగడంతో పాటు ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే 30,000 కోట్ల మార్కును అధిగమించాయి.
యువతకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 100 ఐటీఐల ఆధునీకరణ కొనసాగుతోంది.

హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం పురోగమిస్తోందని, డిసెంబర్ 8–9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
