ఆర్టీవో సురేష్ కుమార్ ఆధ్వర్యంలో గంగవరం హనుమాన్ కూడలి వద్ద రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఆటో యూనియన్, ద్విచక్ర వాహనదారులతో కలిసి భద్రతా నియమాలను అమలు చేయాలనే అంశంపై చర్చించారు.
ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆటోల్లో నలుగురు ప్రయాణికులకంటే ఎక్కువ మంది ప్రయాణించరాదని స్పష్టం చేశారు. అధిక ప్రయాణికులను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, వాటి ఉల్లంఘన వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.
అలాగే మైనర్లు ద్విచక్ర వాహనాలు, ఆటోలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రహదారిపై వేగ పరిమితులను పాటిస్తూ, డ్రైవింగ్ లైసెన్స్, బండీ ఇన్సూరెన్స్ వంటి అవసరమైన పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని అన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ఎస్సై, ఆటో యూనియన్ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వాహనదారుల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులు పేర్కొన్నారు.








