కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి కేంద్రంగా నకిలీ కరెన్సీ ముద్రణ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా, లక్షా 33 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రణకు వాడిన ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన నిందితులు రాజోలు మండలం తాటిపాకకు చెందిన పాస్టర్ కోళ్ళ వీర వెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీర రాఘవ రెడ్డి, గన్నవరం కు చెందిన షేక్ మస్తాన్‌గా గుర్తించారు. రాజోలు ఎస్. ఐ రాజేష్ కృషిని అభినందించిన జిల్లా ఎస్. పి. కృష్ణారావు, రివార్డులు అందజేశారు.
ఈ కేసుతో పాటు, జిల్లాలో జరిగిన 13 దొంగతన కేసులను కూడా పోలీసులు చేధించారు. మొత్తం 24.65 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 311 గ్రాముల బంగారం, 3.2 కిలోల వెండితో పాటు ఇతర వస్తువులను కూడా రికవర్ చేశారు.
ఆత్రేయపురం, ఆలమూరు, అంబాజీపేట, సఖినేటిపల్లి, కొత్తపేట ప్రాంతాల్లో కేసులను విచారించిన కోనసీమ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి కృషిని అభినందించిన జిల్లా ఎస్. పి. ప్రశంస పత్రాలు, రివార్డులు అందజేశారు.
