PM Modi: భారత్ ప్రభుత్వానికి పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో ఫోన్లో మాట్లాడారు.
ప్రధాని మోదీ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఘర్షణలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. ఈ సంభాషణ వివరాలను మోదీ ‘ఎక్స్’(X)వేదిక ద్వారా పంచుకున్నారు.
అదేవిధంగా, ఆదివారం రాత్రి భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ అత్యున్నత కమిటీ దేశ భద్రత, వ్యూహాత్మక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
సమావేశంలో పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు, దాని పరిణామాలు, ఇరాన్–ఇజ్రాయెల్ దాడులు, యూఏఈ పై క్షిపణులు, డ్రోన్ల దాడులు వంటి అంశాలు సమగ్రంగా చర్చించబడ్డాయి.
ప్రధాని మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (Mohammed bin Zayed Al Nahyan) తో ఫోన్లో మాట్లాడి యూఏఈలో ఉన్న భారతీయుల భద్రతకు అన్ని విధాలా సహకరించాలని తెలిపారు. ఇరాన్ దాడులను ఖండిస్తూ, యూఏఈ ప్రభుత్వానికి భారతదేశం పూర్తి మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు.
అంతేకాక, అక్కడ ఉన్న భారతీయుల పట్ల జాగ్రత్త తీసుకున్నందుకు షేక్ మహమ్మద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోన్‌కాల్ సంభాషణ పౌరుల భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై భారత ప్రభుత్వ బాధ్యతను మరోసారి రుజువు చేసింది.









