ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2 ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రూ.1740.95 కోట్ల రికార్డు కలెక్షన్లు రాబట్టింది. అయితే, ఈ లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాలకు రాయితీగా కేటాయించడంతో పాటు జానపద కళాకారుల పెన్షన్ కోసం వినియోగించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
పిటిషనర్ కోర్టుకు ఇచ్చిన వాదనల్లో, టికెట్ ధరలు పెంచే అధికారాన్ని ప్రభుత్వం ఎలా ఉపయోగించిందో స్పష్టత లేదని తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్లనే మూవీ భారీ ఆదాయాన్ని సాధించిందని, అందువల్ల ఆ లాభాలను కళాకారుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రామాణికంగా తీసుకుని, ఈ విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు.
న్యాయమూర్తి స్పందిస్తూ, టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఇప్పటికే ముగిశాయి కదా అని ప్రశ్నించారు. అయితే, లాభాలు కొనసాగుతున్న కారణంగా ఈ అంశం సంబంధితమైనదేనని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషనర్ న్యాయవాది నరసింహారావు తెలిపారు.
వాదనలు విన్న అనంతరం, పిటిషనర్ సుప్రీం కోర్టు గత తీర్పుల కాపీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప-2 లాభాలపై ఇలాంటి చట్టపరమైన దాఖలాలు ముందు ఇంకా ఎలా మారుతాయో చూడాలి.