ఫోన్ ట్యాపింగ్ కేసు – నిందితులకు రెడ్ కార్నర్ నోటీసు

Red Corner Notice issued against key accused in phone tapping case. Telangana govt initiates action to bring them back from the U.S.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన నిందితులను విదేశాల నుంచి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకరరావు, మరో నిందితుడు అరువెల్ల శ్రవణ్‌రావులపై ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి దీనిపై సమాచారం అందింది.

విదేశాల్లో తలదాచుకున్న నిందితులను తీసుకురావడానికి కేంద్ర హోం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖతో హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. ఈ నోటీసు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కు చేరితే, నిందితులను తాత్కాలికంగా అరెస్టు చేసి డిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

అయితే, నిందితులు అమెరికాలోని న్యాయస్థానంలో ప్రొవిజినల్ అరెస్టును సవాల్ చేసే అవకాశం ఉంది. అక్కడి కోర్టు వారి పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే, డిపోర్టేషన్ ప్రక్రియలో ఆలస్యం జరుగుతుంది. ఒకవేళ కోర్టు ఊరట ఇవ్వకపోతే, వారిని భారత్‌కు పంపే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రాముఖ్యతనిచ్చి పరిశీలిస్తోంది. నిందితులను త్వరగా భారత్‌కు తీసుకురావడానికి క్రమపద్ధతిలో లీగల్ ప్రాసెస్‌ను అనుసరించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *