Oracle Layoffs: కృత్రిమ మేధస్సు(AI) ఆధారిత సాంకేతికతలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగాన్ని వేగంగా మార్చేస్తున్నాయి. సంస్థల పనితీరు మరింత సమర్థవంతంగా మారుతున్నప్పటికీ, అదే సమయంలో ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి పెరుగుతోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ తీసుకున్న నిర్ణయం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో గణనీయమైన కోత విధించింది.
గత ఏడాది సుమారు 1.62 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 1.41 లక్షలకు తగ్గింది. అంటే దాదాపు 21 వేల ఉద్యోగాలు సంస్థ నుంచి మాయమయ్యాయి. మొత్తం ఉద్యోగుల్లో ఇది సుమారు 13 శాతం తగ్గుదలగా నమోదైంది. ఒరాకిల్ వెల్లడించిన వివరాల ప్రకారం, సంస్థ కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత వ్యవస్థలను వేగంగా అమలు చేయడం వల్ల ఉద్యోగ అవసరాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
పలు విభాగాల్లో ఆటోమేషన్ పెరగడంతో మానవ వనరుల అవసరం తగ్గిందని కంపెనీ సూచించింది. అంతేకాకుండా వ్యాపార వ్యూహాల్లో మార్పులు, నిర్వహణ పునర్వ్యవస్థీకరణ, ఇతర సంస్థల విలీనాలు, పనితీరు సమీక్షలు కూడా ఈ నిర్ణయానికి కారణాలుగా పేర్కొంది. ప్రస్తుతం ఒరాకిల్ తన దృష్టిని క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల విస్తరణపై కేంద్రీకరించింది. భారీ డేటా సెంటర్ల నిర్మాణం, అధునాతన ఏఐ సేవల అభివృద్ధి కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది.
ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 70 బిలియన్ డాలర్ల మూలధన వ్యయాన్ని అంచనా వేసినట్లు తెలిపింది. అయితే ఈ మార్పులకు భారీ ధర చెల్లించాల్సి వచ్చింది. ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాల కోసం కంపెనీ బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు నివేదిక వెల్లడించింది. భవిష్యత్తులోనూ ఏఐ విస్తరణ కొనసాగితే మరిన్ని ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.








