చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్ఐ రవీందర్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచారు. బీఎల్ఓలుగా మాలతి, జ్యోతి విధులు నిర్వర్తించారు. ఓటర్ల వివరాలను తహసిల్దార్ మన్నన్ పరిశీలించి, మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 565 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 41 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఓటర్లు తప్పనిసరిగా ఎన్నికల కమిషన్ సూచించిన 13 రకాల గుర్తింపు దృవపత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావాల్సిందిగా తహసిల్దార్ మన్నన్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేపట్టారు.
పోలింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయానికి ముందే ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.