మెదక్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో చేపట్టని అభివృద్ధిని కేవలం 14 నెలల్లోనే పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామ శివారులో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.
మెదక్‌ను విద్య, వైద్య రంగాల్లో మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రోహిత్ తెలిపారు. 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని, 25 ఎకరాల విస్తీర్ణంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. మెదక్‌ను ఒక విద్యా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు.
వంతెన నిర్మాణంతో గ్రామ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని, రహదారి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో అభివృద్ధి కుంటుపడినప్పటికీ, కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మెదక్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, భవనాలు, వంతెనలు వంటి మౌలిక వసతులపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు-భవనాల శాఖ ఇంజనీర్లు సర్దార్ సింగ్, విజయ సారథి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, యువజన కాంగ్రెస్ నేతలు రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్, మాజీ సర్పంచులు రాజిరెడ్డి, సుధాకర్, ఇతర నాయకులు అంజా గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, షేక్ అక్బర్, చిరంజీవి, రామయ్య, శ్రీనివాస్, బాలేష్, లక్ష్మయ్య, మహేష్, లింగారెడ్డి, తిరుపతి రెడ్డి, పెంట రెడ్డి, సిద్ధిరాం రెడ్డి, రాజు, నెల్లూరు తదితరులు పాల్గొన్నారు.