సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి కేసులో ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కోర్టులు రిమాండ్ విధించగా, అనంతరం అన్ని కేసుల్లో బెయిల్ మంజూరైంది.
జైలు నుంచి పోసాని విడుదల కాబోతున్న తరుణంలో గుంటూరు సీఐడీ పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో ఈ వ్యవహారం మళ్లీ ఆసక్తికర మలుపు తిరిగింది. ఈ పీటీ వారెంట్‌ను సవాల్ చేస్తూ వైసీపీ రాష్ట్ర లీగల్ వ్యవహారాల కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం దీనిపై విచారణ చేపట్టనుంది. పోసాని తరఫు న్యాయవాదులు సీఐడీ తీసుకున్న చర్యలు చట్టబద్ధమా? లేక ఆయనను అనవసరంగా కష్టపెడతారా? అనే అంశాలను కోర్టులో వివరిస్తారు.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ మద్దతుదారులు పోసానిపై నమోదు చేసిన కేసులను అనవసరమని అంటున్నారు. మరోవైపు, జనసేన, టిడిపి నేతలు మాత్రం ఆయన అనుచిత వ్యాఖ్యలకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టు విచారణ అనంతరం ఈ కేసులో కొత్త మలుపులు రావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.