లోకేష్ “స్పీడ్” పాలసీతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్న ఏపీ ప్రభుత్వం
విభజన తర్వాత కొత్త రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తొలి టర్మ్‌లో “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు ప్రత్యేక ప్రాధాన్యం దక్కింది. ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ర్యాంకింగ్స్‌లో ఎప్పుడూ ముందే ఉండేది. అయితే ఇప్పుడు నారా లోకేష్ ఈ మోడల్‌ను మరింత వేగవంతం చేస్తూ “స్పీడ్ పాలసీ” వైపు మలుపు తీసుకొచ్చారు.
ఈజ్ మాత్రమే కాదు, దానికి స్పీడ్ కూడా జోడిస్తే పెట్టుబడులు త్వరగా గ్రౌండ్‌లోకి వస్తాయని భావించి లోకేష్ అధిక వేగంతో పనిచేస్తున్నారు. పెట్టుబడుల అవకాశాలు ఉన్న చోట స్వయంగా వెళ్లి ఇన్వెస్టర్లను ఆకర్షించే విధానం ఆయనకు పారిశ్రామిక వర్గాల్లో మంచి గుర్తింపును తెచ్చింది.
ఏపీపై గతంలో ఉన్న నెగటివ్ ఇమేజ్‌ను చక్కగా మార్చి ఇండస్ట్రీ–ఫ్రెండ్లీ రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నంలో లోకేష్ ముందంజలో ఉన్నారు.
పెట్టుబడుల లక్ష్యాన్ని పెంచుకున్న లోకేష్
మంత్రిగా బాధ్యతలు చేపట్టే ముందు లోకేష్ లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల సృష్టి. ఈ టార్గెట్ సాధించేందుకు తొలి రోజునుంచే స్పీడ్ పెంచారు. 17 నెలల్లోనే 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం ఆయన వేగవంతమైన యాక్షన్‌కు నిదర్శనం.
అందుకే ఇప్పుడు అయిదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్ ఆకర్షించాలనే పెద్ద లక్ష్యాన్ని సెట్చేసుకున్నారు. నేను ఇంకా ఆకలి మీదున్నాను 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు చేరితేనే విశ్రాంతి తీసుకుంటాను” అని ఆయన జాతీయ బిజినెస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ – కొత్త కాన్సెప్ట్
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” (SoDB) మోడల్‌ను అమలు చేస్తోంది. ఒక నెల ఆలస్యం కూడా పెట్టుబడులను వేరే రాష్ట్రాలకు మళ్లించే పరిస్థితి వస్తుందని లోకేష్ చెబుతున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయంలోనూ ఆలస్యం లేకుండా జరుపుతోంది.
ఇటీవల జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో 410 MoUలు, 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. వీటితో 7.5 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యానికి ఈ పెట్టుబడులు కీలకమని లోకేష్ భావిస్తున్నారు.
వ్యవసాయ రాష్ట్రం నుంచి పారిశ్రామిక కేంద్రంగా ఏపీ మార్పు
2014 తర్వాత పరిశ్రమల పెరుగుదల మందగించినప్పటికీ, 2024 ఎన్నికల తరువాత ప్రభుత్వం మారడంతో పరిస్థితి మారింది. 17 నెలల్లోనే 120 బిలియన్ డాలర్ల ఫర్మ్ కమిట్‌మెంట్‌లు రావడం ఇందుకు నిదర్శనం.
గూగుల్ 15 బిలియన్ డాలర్ల AI హబ్, అర్సెలార్‌మిటాల్ భారీ స్టీల్ ప్లాంట్, BPCL రిఫైనరీ, NTPC గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి మెగా ప్రాజెక్టులు ఏపీ పారిశ్రామిక దిశను మార్చనున్నాయి.
ఇన్వెస్టర్–ఫ్రెండ్లీ పాలసీలు
పెట్టుబడులు గ్రౌండ్‌లోకి రావడాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం పలు సులభతరణ చర్యలు తీసుకుంది. ల్యాండ్ అలాట్‌మెంట్‌ను 6 రోజుల్లో పూర్తి చేస్తామన్న హామీ, రాష్ట్ర స్థాయి అధికారుల సమన్వయం—ఇవన్నీ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.
“ఇన్వెస్టర్ ప్రాజెక్ట్ మాది కూడా దాన్ని మేం ఓన్ చేసుకుంటాం” అనే మాట రాష్ట్ర యంత్రాంగంలో సంస్కృతిగా మారింది. రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ అనివార్యం అని, ఆ పోటీ భారత్ మొత్తానికే లాభంగా మారుతుందని లోకేష్ అభిప్రాయం. అలాంటి పోటీలో ఏపీ ముందంజలో ఉండేందుకు అవసరమైన సూపర్ విజన్‌తో ఆయన పనిచేస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం ప్రకారం, ఈ స్పీడ్ పాలసీతో వచ్చే ఐదేళ్లలో ఏపీ పారిశ్రామిక రంగం ముఖచిత్రం పూర్తిగా మారడం ఖాయం.
ALSO READ:Local Telangana Polls:ప్రజాపాలన వారోత్సవాలు పూర్తయ్యాకనే ఎన్నికలు
