లోకేశ్ అభివృద్ధి హామీలు నిలబెట్టిన మంగళగిరి

Lokesh Fulfills Development Promises in Mangalagiri

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలలే అయినా ఎన్నికల హామీలను పూర్తిగా నెరవేర్చే పనిలో ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళగిరిలో జరిగిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. నియోజకవర్గ ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. 26 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు.

మంగళగిరి అభివృద్ధిలో భాగంగా సూపర్‌ సిక్స్‌ హామీలతో పాటు ప్రజలకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నానని లోకేశ్ తెలిపారు. ఏప్రిల్ 13న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, వచ్చే ఏడాది అదే రోజున ప్రారంభోత్సవం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సంజీవని పేరుతో మంగళగిరి, తాడేపల్లిలో క్లినిక్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.

దుగ్గిరాలలో మొబైల్ క్లినిక్ ఏర్పాటు చేసి ఉచిత చికిత్సతో పాటు మందులు అందిస్తున్నామని లోకేశ్ వివరించారు. మంగళగిరిలో నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను అమలు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.

నిరుపేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తున్నామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రతి కుటుంబానికి ఉపాధి మార్గం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల అండదండలతో మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *