ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుముల్ ఖాన్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు ప్రత్యక్షంగా బోధించారు. కల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌ను తనిఖీ చేశారు. పాఠశాల సదుపాయాలను పూర్తిగా పరిశీలించి, విద్యార్థుల అవసరాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
తర్వాత ఓ తరగతి గదిలో విద్య బోధన జరుగుతున్న తీరును పరిశీలించేందుకు 10వ తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు అనేది నేరుగా గమనించి, విద్యార్థులకు మరింత అర్థమయ్యేలా బోధన ఉండాలని సూచించారు.
కేవలం తనిఖీ మాత్రమే కాకుండా, కలెక్టర్ స్వయంగా బోర్డుపై చాక్ తో బొమ్మలు వేస్తూ విద్యార్థులకు సోషల్ స్టడీస్ పాఠాలు బోధించారు. బెంగాల్ విభజన, ఇండియా మ్యాప్, వాతావరణం వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా వివరించారు. కలెక్టర్ బోధన పట్ల విద్యార్థులు ఆసక్తిగా స్పందించారు.
విద్యార్థులకు అన్ని సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్కూల్ సిబ్బందికి సూచించారు. విద్యా ప్రమాణాలను పెంపొందించి, విద్యార్థులకు ఉత్తమ విద్య అందించేందుకు కృషి చేయాలని పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. కలెక్టర్ పాఠశాల పర్యటన విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.