KCR Meeting: బీఆర్ఎస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యూహాలకు పదును పెట్టారు. ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్ వేదికగా జరిగిన కోర్ కమిటీ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. సుమారు 23 మంది ముఖ్య నేతలు పాల్గొన్న ఈ భేటీలో సంస్థాగత మార్పులు, సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి బలోపేతంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తొలిసారిగా విస్తృత సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. అయితే కేవలం సంఖ్య కోసం కాకుండా పార్టీ కోసం నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేసే క్రియాశీలక సభ్యులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ స్పష్టం చేశారు. గతంలో ఉన్న పెద్ద సంఖ్యలో సభ్యత్వాలను పక్కన పెట్టి, ఇప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచే వారినే గుర్తించాలనే నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ యంత్రాంగంలో కూడా కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. నియోజకవర్గ స్థాయిలో పాత ఇంచార్జీలు లేదా మాజీ ఎమ్మెల్యేలపై ఆధారపడకుండా, రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి కొత్త ఇంచార్జీలను నియమించాలని నిర్ణయించారు. దీని ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన పరిస్థితులను అంచనా వేయడంతో పాటు గ్రూపు రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో పార్టీ శ్రేణులను మరింత చురుకుగా మార్చేందుకు కేసీఆర్ ఈ సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి బలంగా పనిచేయాలని ఆయన సూచించారు.
త్వరలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపనున్నట్లు సమాచారం. ఎర్రవల్లి సమావేశం బీఆర్ఎస్‌లో కొత్త ప్రక్షాళన దశకు నాంది పలికిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.








