Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాతో డీకే శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నాయకత్వ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో కీలకమైన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశం శనివారం జరగనుంది. ఈ సమావేశంలో డీకే శివకుమార్‌ను సీఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుంది.
జూన్ 1న డీకే శివకుమార్ కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. అప్పటివరకు సిద్ధరామయ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇక మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ చర్చల్లో యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య కోరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సీనియర్ నాయకులు కేజే జార్జి, జి. పరమేశ్వరలకు క్యాబినెట్లో చోటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సిద్ధరామయ్య ఆయన నివాసంలో కలిశారు. అంతకుముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా ఆయన భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక సమావేశాలేనని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి.








