Saraswati Anthya Pushkaralu: కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతం సరస్వతి అంత్య పుష్కరాల కోసం అద్భుతంగా ముస్తాబవుతోంది. మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఏడాది ప్రారంభ పుష్కరాల తర్వాత ఇప్పుడు అంత్య పుష్కరాలు నిర్వహించనుండటంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, VIP ఘాట్ ప్రాంతాల్లో ప్రత్యేక అలంకరణలు, లైటింగ్, సౌండ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి ప్రాంతాన్ని ప్రయాగ్‌రాజ్‌ను తలపించేలా తీర్చిదిద్దుతున్నారు. వీఐపీ భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మాణం పూర్తవుతోంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, వసతి, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ఉండటంతో కొన్ని శాశ్వత నిర్మాణాలను కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు.
12 రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి స్వామిజీలు, పీఠాధిపతులు పాల్గొననున్నారు. ప్రతి రోజూ ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. మే 21న మహా గణపతి హోమంతో ప్రారంభమై, 22న సుబ్రహ్మణ్య షడాక్షరీ హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహా మృత్యుంజయ హోమం, 26న దుర్గా సూక్త హోమం, 27న మహా సుదర్శన హోమం, 28న వేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతి హోమం, 30న ధన్వంతరి హోమం, 31న మహారుద్ర హోమం, జూన్ 1న లఘు చండీ మహా పూర్ణాహుతితో పుష్కరాలు ముగుస్తాయి.
కాళేశ్వరం త్రివేణి సంగమం ప్రాంతం ఈసారి ఆధ్యాత్మిక వైభవంతో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.








