ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేసిన రెండు కీలక ఉపగ్రహాల ప్రయోగాలు అనూహ్యంగా నిలిచిపోయాయి. NVS-03, GISAT-1A ఉపగ్రహాలు ప్రయోగానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు రాకపోవడంతో వాటి ప్రయోగ తేదీలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఈ రెండు ఉపగ్రహాలు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఒక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఉపయోగించాల్సిన జీఎస్‌ఎల్‌వీ మార్క్-2 (GSLV Mk-II) రాకెట్ కూడా ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉంచారు.
రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అధికారిక అనుమతి అందకపోవడంతో ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఎదురైన సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఇస్రో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 2025 మేలో జరిగిన PSLV-C61, 2026 జనవరిలో జరిగిన PSLV-C62 ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ప్రతి దశను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి లోపాలకు అవకాశం ఇవ్వకుండా ఇస్రో అధికారులు, కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలను సమీక్షిస్తున్నాయి. తుది అనుమతులు వచ్చిన వెంటనే NVS-03, GISAT-1A ప్రయోగ తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
దేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం, భూ పరిశీలన, రక్షణ రంగ అవసరాలకు ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి. దీంతో ఈ ప్రయోగాలపై అంతరిక్ష రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ALSO READ: Vande Bharat Sleeper Train | ఏపీకి మరో వందేభారత్ కానుక.. విశాఖ నుంచి బెంగళూరుకు సూపర్ ఫాస్ట్ జర్నీ








