iPhone 18 సిరీస్ లాంచ్‌కు సంబంధించిన కొత్త వివరాలు యాపిల్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ తెలిపిన వివరాల ప్రకారం, యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో తన కొత్త ఐఫోన్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉన్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అమెరికాలోని ముఖ్య సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని యాపిల్ సాధారణంగా సెప్టెంబర్ ప్రారంభంలోనే ఈవెంట్ నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఈసారి iPhone 18 సిరీస్‌లో ప్రో మోడళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. తాజా లీకుల ప్రకారం iPhone 18 Pro మరియు iPhone 18 Pro Max మోడళ్లలో 2nm టెక్నాలజీతో రూపొందించిన A20 Pro చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా వేగవంతమైన పనితీరు, మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ లభించనున్నాయి.
అదనంగా యాపిల్ స్వంతంగా అభివృద్ధి చేస్తున్న C2 మోడెమ్, మరింత చిన్న డైనమిక్ ఐలాండ్, అలాగే అండర్-డిస్‌ప్లే ఫేస్ ఐడీ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఈ సిరీస్‌లో కనిపించవచ్చని ప్రచారం జరుగుతోంది. కెమెరా విభాగంలో ప్రో మ్యాక్స్ మోడల్‌లో వేరియబుల్ అపర్చర్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉందని టెక్ రిపోర్టులు సూచిస్తున్నాయి. ఇక ఈసారి యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ‘iPhone Ultra’గా పిలుస్తున్న ఈ డివైస్ పెద్ద ఫోల్డబుల్ డిస్‌ప్లే, స్లిమ్ డిజైన్‌తో రానుందని సమాచారం.
తెరిచినప్పుడు అత్యంత తక్కువ మందం కలిగి ఉండేలా దీన్ని రూపొందిస్తున్నట్లు లీకులు చెబుతున్నాయి. ధరల విషయానికి వస్తే, గ్లోబల్ మార్కెట్‌లో మెమరీ మరియు స్టోరేజ్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో iPhone 18 Pro సిరీస్ ధరలు కూడా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై యాపిల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.








