LIVE
Monday, November 23, 2026
LIVE
LIVE

India Nepal Relations | భారత్‌తో నేపాల్ దోస్తీ మరింత బలోపేతం.. రూ.24 వేల కోట్ల నేపాలీ రూపాయల సాయం

by Bajaswamy
5 views
India Nepal Relations

India Nepal Relations: భారత్–నేపాల్ స్నేహబంధంలో మరో కీలక ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ, నేపాల్ అభివృద్ధికి భారత్ భారీ ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. నేపాల్ ప్రధాని బాలేన్ షా భారత పర్యటన సందర్భంగా ఈ కీలక నిర్ణయం వెలువడింది. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం, నేపాల్‌కు రూ.24,000 కోట్ల నేపాలీ రూపాయల విలువైన అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.15,000 కోట్లకు సమానం. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేన్ షా భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్, నేపాల్ మధ్య బంధం కేవలం పొరుగు దేశాల సంబంధం కాదని, విశ్వాసం, స్నేహం, పరస్పర సహకారంపై ఆధారపడిన అనుబంధమని పేర్కొన్నారు. నేపాల్ యువత ఆశలు, ఆకాంక్షలకు బాలేన్ షా నాయకత్వం ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య రోడ్డు, రైల్వే, సరిహద్దు కనెక్టివిటీని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

మరోవైపు బాలేన్ షా మాట్లాడుతూ.. భారత్, నేపాల్ మధ్య స్నేహబంధం హిమాలయాలంత దృఢమైనదని, సముద్రమంత విశాలమైనదని అభివర్ణించారు. ప్రకృతి వైపరీత్యాలు, కష్టకాలంలో భారత్ అందిస్తున్న సహాయానికి భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రధాని మోడీని నేపాల్ పర్యటనకు ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. సివిల్ సర్వీసెస్ శిక్షణ, అంతరిక్ష పరిశోధనలు, ఆరోగ్యం, వైద్యం, పట్టణాభివృద్ధి, ఆయుర్వేదం, సంప్రదాయ వైద్య రంగాల్లో సహకారానికి మార్గం సుగమమైంది. అంతేకాకుండా ఇంధనం, రవాణా అనుసంధానానికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ఇరువురు ప్రధానులు ప్రారంభించగా, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. చమురు సరఫరాలో అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురైనప్పటికీ నేపాల్‌కు ఇంధనం, ఎరువులు, నిత్యావసర వస్తువుల సరఫరాలో భారత్ సహకారం కొనసాగించిందని మోడీ గుర్తుచేశారు. మొత్తంగా ఈ పర్యటన భారత్–నేపాల్ సంబంధాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. భారీ ఆర్థిక సహకారం, ఎనిమిది ఒప్పందాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత బలపడనుంది.

banner
banner

You may also like

Leave a Comment

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More