Arunachalam Karthigai Deepam: కార్తీక మాసం వచ్చిందంటే శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతాయి. అందులోనూ అరుణాచలంలో జరిగే కార్తీక మహాదీపోత్సవానికి ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ మహోత్సవం కోసం తిరువణ్ణామలైలో భారీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈసారి సుమారు 50 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం కార్తీక పౌర్ణమి వేడుకలకు సిద్ధమైంది. మహాదీపం వెలిగించే కార్యక్రమానికి ముందుగానే భక్తుల రాక భారీగా పెరిగింది. సోమవారం రాత్రి 11:42 గంటలకు పవిత్ర గిరివలమ్ ప్రారంభమై, మంగళవారం నవంబర్ 24 రాత్రి 8:23 గంటల వరకు కొనసాగనుంది.
ఈ సందర్భంగా భక్తులు అరుణాచల కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ చేయనున్నారు. దాదాపు 21 గంటల పాటు కొనసాగే ఈ పవిత్ర ప్రదక్షిణలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు చేరుకుంటున్నారు. సాధారణ రోజుల్లోనే లక్షలాది మంది వచ్చే ఈ క్షేత్రానికి కార్తీక దీపోత్సవం, చిత్రా పౌర్ణమి సమయాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఈ వేడుకల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం అరుణాచల కొండ శిఖరంపై మహాదీపాన్ని వెలిగించడం. సముద్ర మట్టానికి సుమారు 2,668 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై కార్తీక పౌర్ణమి సందర్భంగా మహాజ్యోతిని ప్రజ్వలింపజేయనున్నారు. ఇందుకోసం 150 నుంచి 175 కిలోల బరువున్న భారీ రాగి పాత్రను (కొప్పరై) ప్రత్యేకంగా సిద్ధం చేశారు. సుమారు 5 నుంచి 5.5 అడుగుల ఎత్తున్న ఈ పాత్రను 48 రోజుల పాటు కఠిన వ్రతం ఆచరించిన భక్తులు కొండ శిఖరానికి తీసుకెళ్లనున్నారు.
శివుడు అగ్నిలింగ రూపంలో దర్శనమిచ్చిన పవిత్ర స్థలంగా అరుణాచలాన్ని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఇక్కడ వెలిగించే మహాదీపాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, భద్రత, రవాణా వంటి సదుపాయాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తోంది. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా సాధారణ భక్తులకు కొండపైకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. మొత్తంగా కార్తీక మహాదీపం, గిరివలమ్‌తో అరుణాచలం మరోసారి భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది. మహాజ్యోతి దర్శనంతో తమ జీవితాల్లో శాంతి, సౌభాగ్యం కలగాలని లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు.
ALSO READ: Sri Sathya Sai Baba Jayanti | సత్యసాయి బాబా జయంతికి రాష్ట్ర పండుగ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
