Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeTelanganaHYDRAA | రూ.30 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

HYDRAA | రూ.30 వేల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

-

Chat on WhatsApp

పర్యావరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని పుప్పాలగూడ–ఖాజాగూడ సరిహద్దుల్లో హైడ్రా (HYDRAA) భారీ ఆపరేషన్ నిర్వహించింది. సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడుతూ ఆ ప్రాంతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈ భూమి విలువ సుమారు రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ భూమిలో 250 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాచీన రాతి గుట్టలు, సహజసిద్ధమైన గుహలు, పర్యావరణపరంగా విలువైన చెట్లు ఉన్నాయి.

హైడ్రా అధికారులు రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇది ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం కొన్ని సర్వే నంబర్స్ లో మొత్తం కలిపి మొత్తం 293.05 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొంత భాగం వివిధ కారణాల వల్ల ప్రైవేట్ భూమిగా గుర్తించబడగా, మిగిలిన 200 ఎకరాలు హెచ్‌ఎండీఏకు కేటాయించబడ్డాయి. ఈ భూమిలో కొన్ని ఆలయాలకు, దర్గాకు చిన్న భాగాలు కూడా కేటాయించినట్లు రికార్డులు చెబుతున్నాయి.

దశాబ్దాలుగా ఈ చారిత్రక రాతి గుట్టలను కాపాడాలని ‘సొసైటీ టూ సేవ్ రాక్స్’ ప్రతినిధులు పోరాడుతున్నారు. హైకోర్టు కూడా 2019లో ఈ ప్రాంతాన్ని రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సరిహద్దులు స్పష్టంగా లేకపోవడంతో కబ్జాలకు అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ సమస్యపై వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం అధికారులు భూమిని గుర్తించి ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. ఈ చర్యలతో భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం లేకుండా చేయనున్నట్లు తెలిపారు.

స్థానికులు, పర్యావరణవేత్తలు ఈ చర్యలను స్వాగతించారు. చారిత్రక గుట్టలు, భగీరథమ్మ చెరువు పునరుద్ధరణతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp