Hyderabad Holi celebrations: హైదరాబాద్ లో హోలీ సంబరాలు రంగుల హరివిల్లు కమ్ముకున్నాయి. డీజే మోతలు, రెయిన్‌డ్యాన్స్ జోన్లు, గులాల చిమ్మర్లు, డప్పు–డోలు వాయిద్యాలతో నగరం ఉత్సాహంతో మోగుతోంది. ఈసారి మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు 50కుపైగా ఈవెంట్లు నిర్వహించేందుకు ఈవెంట్ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా 4వ తేదీన ఎక్కువ కార్యక్రమాలు ఉండనున్నాయి. నెక్లెస్ రోడ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి.
పుణె, పంజాబ్ ప్రాంతాల నుంచి ధోల్ కళాకారులు, కార్నివాల్ డ్యాన్సర్లు ఆకర్షణగా నిలవనున్నారు. మడ్‌పిట్‌లు, లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, సెలబ్రిటీ డీజేలు సందడిని రెట్టింపు చేయనున్నాయి. పర్యావరణ హితానికి ప్రాధాన్యం ఇస్తూ సింథటిక్ రంగుల వినియోగాన్ని తగ్గించాలని నిర్వాహకులు నిర్ణయించారు.
“జంగిల్ హోలీ”, “లాఠ్ మార్ హోలీ”, “రాధాకృష్ణ హోలీ”, “ధమాకా హోలీ” వంటి థీమ్‌లతో వేడుకలు నిర్వహించనున్నారు. భోజన ఏర్పాట్లు కూడా విస్తృతంగా ఉంటాయని తెలిపారు.
సెలబ్రిటీల హాజరుతో ఈసారి ఉత్సాహం మరింత పెరిగింది. అనన్య నాగళ్ల, మంగ్లీ, తేజుప్రియ, అనసూయ, రోల్ రైడా వంటి ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు సంబరాలపై ప్రభావం చూపబోవని పార్టీ ప్రియులు చెబుతున్నారు. మొత్తంగా నగరం హోలీ వేడుకలతో రంగుల మయంగా మారింది.








