దిల్‌సుఖ్‌నగర్‌లో 2013లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ తీర్పుతో దోషుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసినట్లు న్యాయస్థానం వెల్లడించింది.
2016 డిసెంబర్ 13న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ వారు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. హైకోర్టు విచారణ అనంతరం న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పీ. శ్రీసుధల ధర్మాసనం తీర్పు వెలువరించింది. వారిపై వేసిన అభియోగాలను న్యాయస్థానం సమర్థించడమే కాకుండా, ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలను గమనించి తీర్పును ఖరారు చేసింది.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. 2013 ఫిబ్రవరి 21న బస్టాప్, మిర్చిపాయింట్ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 131 మంది వరకు గాయపడ్డారు. అప్పట్లో జరిగిన ఈ ఉగ్రవాద చర్యపై పోలీసులు, ఎన్‌ఐఏ తీవ్ర విచారణ చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ మాత్రం ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు అధికారులు అనేక దేశాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. హైకోర్టు తీర్పుతో న్యాయం జరిగింది అని బాధిత కుటుంబాలు అభిప్రాయపడుతున్నాయి.