నాయనపల్లి మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాఠశాల హెడ్ మిస్ట్రెస్ ఎం. నిర్మలదేవి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలుతో విద్యార్థుల చదువుకు మద్దతు అందుతుందని అన్నారు.
పిల్లల ప్రవర్తన, వారి విద్యా ప్రగతి గురించి తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లలు ఇంట్లో చదువులో ఎలా నడుస్తున్నారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లల సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు.
పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ఉపాధ్యాయుల తో పాటు తల్లిదండ్రులూ కృషి చేయాలని హెడ్మిస్ట్రెస్ తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లల జీవన విధానంపై శ్రద్ధ చూపితే, వారు సరికొత్త విజయాలను సాధించగలరని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య పలు అభిప్రాయాలు మార్పిడి జరిగాయి. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ పిల్లల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్నారు.