తెలుగు నాడు విద్యార్థి సమైక్య (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ఇంటర్ మీడియేట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్, నీట్ పరీక్షను ఆదివారం ఉదయం 10:00 గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు VRK అకాడమీలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ విద్యార్థులకు పోటీ పరీక్షలపై భయాన్ని తొలగించడం, అవగాహన కల్పించడం టీఎన్ఎస్ఎఫ్ లక్ష్యమని తెలిపారు. పరీక్ష అనంతరం “100 మినిట్స్ 100 షార్ట్ కట్స్” అనే ప్రత్యేక సెషన్‌ను గణిత శాస్త్ర అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్ష విధానం, ఎంసెట్, నీట్ విధానం పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలిపారు. మంచి ర్యాంకు సాధించడానికి సరైన ప్రణాళిక అవసరమని, ఉచిత నమూనా పరీక్ష రాయడం ద్వారా ప్రశ్నాపత్రంపై అవగాహన పెరుగుతుందని వివరించారు. పోటీ పరీక్షలలో విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటే, అందుబాటులో ఉన్న సీట్లు మాత్రం వేలల్లోనే ఉంటాయని, కాబట్టి కష్టపడి ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రవళి, సంధ్య, ప్రసన్న, రజిని, వసంత, సంతోష్, ప్రవళిక పాల్గొన్నారు. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది.