కొత్తూరు మండలంలోని కడుము, హంస గ్రామ పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కడుము గ్రామ సమీపంలోని పొలాల్లో జొన్న పంటను ఈ ఏనుగులు నాశనం చేసిన విషయాన్ని స్థానిక రైతులు, గ్రామ నాయకులు MLA మామిడి గోవిందరావుకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వెంటనే స్పందించిన శాసనసభ్యులు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామస్తులకు సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు.
అధికారుల బృందం వెంటనే కదిలి, ఏనుగుల కదలికలను గమనిస్తూ స్థానిక ప్రజలకు మార్గనిర్దేశం చేస్తోంది. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని MLA సూచించారు.
ఏనుగుల సమస్యపై MLA తక్షణ స్పందన గ్రామ ప్రజల్లో హర్షాన్ని కలిగించింది. ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించడంతో, ప్రమాదాన్ని నివారించగలిగామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, అవసరమైతే మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.