పోక్సో చట్టం మైనర్ బాలికల రక్షణ కోసం తీసుకొచ్చినప్పటికీ, కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారని #కోర్ట్ సినిమా చూపిస్తుంది. అమాయకులను చట్టపరంగా ఇరుకున పెట్టే సంఘటనలను సినిమాగా మార్చి, న్యాయవ్యవస్థలో జరిగే పరిస్థితులను ప్రతిబింబించే ప్రయత్నం చేసింది.
కథలో 19 ఏళ్ల పేద కుర్రాడు, 17 ఏళ్ల అమ్మాయిని ప్రేమించి తరచుగా ఇంటికి తీసుకురావడం, తల్లి దీనికి అండగా నిలవడం ప్రధానాంశంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమ్మాయి తల్లిదండ్రులు పోక్సో చట్టం కింద కేసు పెట్టడంతో కథ మలుపు తిరుగుతుంది. కోర్టు సన్నివేశాలు నిజజీవితానికి దూరంగా, సినిమాటిక్‌గా ఉండటం కథకు కొన్ని లోపాలను తెచ్చిపెట్టింది.
డైరెక్టర్ ఎమోషనల్‌గా కాకుండా, కథను చాలా సాధారణంగా తీసుకెళ్లారు. పోక్సో కేసులో అకారణంగా ఇరుక్కుని బయటపడటం అంత ఈజీ కాదని, కానీ సినిమా మాత్రం దీనిని సింప్లీ చూపించిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చట్ట వ్యవస్థను ఎదుర్కోవాలంటే తగిన అవగాహన ఉండాలని సినిమా చివర్లో ఇచ్చిన సందేశం మాత్రం ఆసక్తికరంగా మారింది.
సినిమాలో శివాజీ పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చాలాకాలం తర్వాత శివాజీకి మంచి పాత్ర దొరకడం, ఆయన అభినయం బలంగా నిలవడం చిత్రానికి కలిసొచ్చిన అంశాలు. చట్టాలపై అవగాహన అవసరమని చివరి సందేశం సమాజానికి ఉపయోగపడేలా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు.