కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి దేశ పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట మండలం వడియారం, కర్నాల్ పల్లి, చేగుంట గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంసిద్ధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో, యువజన కాంగ్రెస్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షుడు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, మహానీయుల చిత్రపటాలతో గ్రామ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో, సుమారు వందమంది వివిధ పార్టీలకు చెందిన వారు, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చెరుకు శ్రీనివాస్ రెడ్డిని, చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
అంతేకాదు, ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో 21 వేల కోట్ల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేయవలసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని” అన్నారు. అలాగే, “సంపన్నులు తినే బియ్యమే సామాన్యులు తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాం” అని చెప్పారు.