తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడిచినా, ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఆమె ట్విట్టర్ (X) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిపాలనలో విఫలమైందని, రాష్ట్రాన్ని భారీ అప్పుల్లో కూరుకుపోయేలా చేసిందని ఆరోపించారు.
కవిత మాట్లాడుతూ, “రాష్ట్రం ఇప్పటికే ₹1.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. మహిళలకు ₹2,500 ఆర్థిక సహాయం, వివాహం చేసుకునే వారికి 10 గ్రాముల బంగారం, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ₹4,000 పెన్షన్ లాంటి హామీలను పూర్తిగా విస్మరించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా చేతులెత్తేసింది” అని మండిపడ్డారు.
“రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దారుణంగా మోసపోయారు. 420 వాగ్దానాలు చేశారు, అమలు చేసింది సున్నా. రూ.1.5 లక్షల కోట్లు మాయం అయ్యాయి. ప్రజలకు అందాల్సిన డబ్బు ఎక్కడికెళ్లిందో చెప్పాలి” అంటూ ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొత్త మాయాజాలం సృష్టిస్తోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోతే, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హామీలను వెంటనే అమలు చేయకపోతే, బీఆర్‌ఎస్ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆమె స్పష్టం చేశారు.