చైనాలోని షన్‌టైన్ కెమికల్ గ్రూప్ ఉద్యోగులకు పెళ్లి తప్పనిసరిగా ఉండాలని నిబంధన విధించింది. ఒంటరిగా ఉన్న 28-58 ఏళ్ల ఉద్యోగులు సెప్టెంబర్‌లోగా పెళ్లి చేసుకోవాలని, లేకుంటే ఉద్యోగం వదులుకోవాలని హెచ్చరించింది. ఈ నిర్ణయం చైనా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
తమ సంస్థలో వివాహితుల సంఖ్య పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు షన్‌టైన్ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 1200 మంది ఉద్యోగుల్లో పెళ్లి చేసుకోని వారు ఎక్కువగా ఉన్నారని, వారి స్థిరత్వం కోసం ఈ నిబంధనను అమలు చేస్తున్నామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం ఉద్యోగుల స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందని విమర్శలు వెల్లువెత్తాయి.
పెళ్లి నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, కంపెనీ ఎలాంటి హక్కుతో ఇలాంటి ఆదేశాలు ఇస్తుందని నెటిజన్లు మండిపడ్డారు. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ఉద్యోగులను వ్యక్తిగత జీవితం విషయంలో బలవంతం చేయడం అప్రజాస్వామికమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కంపెనీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో షన్‌టైన్ వెనక్కి తగ్గింది. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం తమ ఉద్దేశం కాదని, తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. విపరీతమైన దుమారం రేగడంతో కంపెనీ ఈ వివాదాస్పద నిబంధనను రద్దు చేసుకుంది.