ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరగడంతో రాష్ట్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 15,462 ప్రమాదాల్లో 6,433 మంది మరణించారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మొత్తం ప్రమాదాల్లో మూడో వంతు ద్విచక్ర వాహనాల కారణంగా నమోదయ్యాయి.
సెల్ఫ్ యాక్సిడెంట్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో 53 శాతం వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 8వ స్థానంలో నిలిచింది.
ALSO READ:పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా | Congress Panchayat Election Strategy
నెల్లూరు, తిరుపతి, పల్నాడు, అన్నమయ్య, కాకినాడ జిల్లాల్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఓవర్ స్పీడ్ 79 శాతం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 3 శాతం, మద్యం సేవనం మరియు మొబైల్ వినియోగం ఒక్కోటి 1 శాతం చొప్పున ఉన్నాయని వివరించారు.
జాతీయ రహదారులపై 42 శాతం, రాష్ట్ర రహదారులపై 21 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సచివాలయంలో జరిగిన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశంలో సీఎం పలు సూచనలు చేశారు. ప్రతి ప్రమాదంపై థర్డ్‌పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని, ట్రాన్స్‌పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నెన్సు అమలు చేయాలని ఆదేశించారు.
హెచ్చరికలు ఇచ్చినా వేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై గుర్తించిన 680 బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని సూచించారు.
అనధికార మార్పులు చేసిన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్లు కలిగిన 134 బస్సులను ఇప్పటికే సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పాఠశాల బస్సుల తనిఖీలు కొనసాగుతున్నాయని చెప్పారు.
అత్యవసర సేవల్లో భాగంగా 108 అంబులెన్సులు మరియు నేషనల్ హైవే అంబులెన్సులను ఇంటిగ్రేట్ చేయాలన్నది ముఖ్యమంత్రి ఆదేశం. ప్రమాదాల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించే వారికి ప్రోత్సాహక చర్యలు ఉండాలని సూచించారు.
