కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్ధికుంట గ్రామ దట్టమైన అడవిలో కొలువుదీరిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ఆలయం నిండా శివనామ స్మరణలతో మారుమోగింది. ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. భక్తుల ఉత్సాహం మిన్నంటింది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మమ్మద్ షబ్బీర్ అలీ, లోయపాటి నర్సింగరావు, దేవాలయ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన అర్చకులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి పాల్గొన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ టూరిజం శాఖ మంత్రితో చర్చించి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేవస్థానం ప్రాచీనతను, ప్రత్యేకతను మరింతగా ప్రజలకు పరిచయం చేయడంపై దృష్టి పెడతామని తెలిపారు.
ఇక్కడ రోజూ నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని, భక్తుల సౌకర్యార్థం రోజూ టీఎస్‌ఆర్‌టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని అధికారులకు సూచించారు. భక్తులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి తెస్తామని, ఆలయ నిర్మాణ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వేగంగా పూర్తవుతుందని తెలిపారు.
శివనామ స్మరణలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ, గ్రామ కమిటీలు, ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల విశ్వాసానికి ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని కమిటీ సభ్యులు తెలిపారు.