బెంగళూరులోని ఒక పునరావాస కేంద్రంలో దారుణంగా చికిత్స పొందుతున్న రోగిపై ఇద్దరు వ్యక్తులు కర్కశంగా ప్రవర్తించారు. ఈ ఘటనా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. వీడియోలో రోగిని ఓ గదిలో బంధించి కర్రలతో దాడి చేస్తూ అతనిని తీవ్రంగా గాయపరిచారు.
రోగి తమకు దాడి చేయవద్దని వేడుకున్నప్పటికీ ఆ వ్యక్తులు అతన్ని విచక్షణ లేకుండా కొట్టి, ఆ తరువాత ఈడ్చి తీసుకెళ్లారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ దారుణంగా ప్రవర్తించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సంఘటన బెంగళూరులోని నెలమంగళ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ పునరావాస కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన కొన్నిరోజుల క్రితమే జరిగిందని, వీడియో తాజాగా బయటకు వచ్చినట్లు తెలిపారు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై సుమోటో కేసు నమోదు చేయగా, దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల ప్రకటన ప్రకారం, రోగి నిరాకరించిన కారణంగా వార్డెన్ మరియు ఇతర వ్యక్తులు అతనిపై దాడి చేసినట్లు వెల్లడించారు.