Arvind Kejriwal: E20 ఇంధన మిశ్రమ విధానంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజలపై బలవంతంగా అమలు చేస్తోందని ఆరోపిస్తూ ఆప్ నేతలు నిరసనకు దిగారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి ప్రధాని నివాసం వైపు పాదయాత్ర చేపట్టారు. E20 విధానం వల్ల వాహనదారులు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కేజ్రీవాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రజల నుంచి సేకరించిన దాదాపు 2 లక్షలకు పైగా వినతిపత్రాలను ప్రధానికి అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే దీని వల్ల వాహనాల పనితీరు, నిర్వహణ ఖర్చులు, వినియోగదారులపై ప్రభావం వంటి అంశాలపై ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విధానాలను అమలు చేయడం సరికాదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు, ఇంధన దిగుమతుల తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతోనే E20 విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. దీంతో E20 అంశం రాజకీయంగా మరోసారి చర్చకు దారితీసింది.








