EV charging stations: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక చర్యలు చేపట్టింది. సంస్థ పరిధిలోని 162 ప్రాంతాల్లో పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ కేంద్రాల్లో 13 కిలోవాట్ సామర్థ్యం గల లైట్ ఈవీ ఏసీ/డీసీ ఛార్జర్లు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోథేటి(Shiva Shankar Lotheti) తెలిపారు.
ఈ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM E-Drive Scheme కింద ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో క్లీన్ మొబిలిటీని ప్రోత్సహించడం, గ్రీన్‌హౌస్ వాయువుల వాయు కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ పీఎం-కుసుమ్ 2.0 పథకం కింద ఫీడర్ స్థాయి సోలరైజేషన్‌కు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026-27 నుంచి 2029-30 మధ్య ప్రతి సంవత్సరం 550 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని జోడించి మొత్తం 2,200 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదనంగా 500 మెగావాట్లు / 1000 మెగావాట్ గంటల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తొలి దశలో అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, భవిష్యత్ వ్యూహాలపై చర్చించేందుకు సీఎండీ శివ శంకర్, అజయ్ మాథుర్ తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. అలాగే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే తొలి నెట్-జీరో మోడల్ ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఇక రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని విస్తరించేందుకు 7,489 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు లాభం చేకూరేలా 4.36 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 48 వేల గృహాలను కవర్ చేసేలా 39.75 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
ALSO READ:Kadiri Brahmotsavam | కదిరి ఉత్సవంలో అపశ్రుతి…భక్తులకు గాయాలు






