బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో తన అడ్వొకేట్ తో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో స్టేషన్‌కు వెళ్లారు. మంగళవారం విచారణకు రావాలని పోలీసుల నుంచి నోటీసులు అందినా, షూటింగ్ కారణంగా ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమె తరఫున శేఖర్ భాషా స్టేషన్‌కు వెళ్లగా, గురువారం స్వయంగా హాజరై విచారణను ఎదుర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రభావం తీవ్రంగా పెరిగింది. ఈ యాప్‌ల కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకుని చాలా మంది బాధపడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్‌లకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేయడం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వీటిపై పోరాటం చేపట్టారు.
సజ్జనార్ ట్వీట్లకు స్పందించిన ఏపీ, తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. తాజాగా 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై తెలంగాణ పోలీసులు కేసులు పెట్టారు. వారిని విచారణకు రమ్మంటూ నోటీసులు పంపించారు. ఇందులో యాంకర్లు విష్ణుప్రియ, శ్యామలతో పాటు పలువురు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు ఉన్నారు.
విష్ణుప్రియ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో మరింత మంది ఇన్‌ఫ్లూయెన్సర్లపై విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రమోషన్లపై నిఘా పెంచిన పోలీసులు, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.