AP Mock Assembly: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి శాసనసభా ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీలో వేడి వాదోపవాదాలు జరిగాయి. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మాక్ అసెంబ్లీలో మన్యం జిల్లాకు చెందిన లీలాగౌతమ్ మాక్ సీఎం పాత్రను, అదే జిల్లాకు చెందిన సౌమ్య ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి డిప్యూటీ సీఎం గా, తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి విద్యాశాఖ మంత్రిగా, కాకినాడకు చెందిన స్వాతి స్పీకర్‌గా వ్యవహరించారు.
మాక్ అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టి వాటిపై స్వల్పకాలిక చర్చ సాగింది. రాష్ట్రంలోని 45,000కు పైగా పాఠశాలలకు ప్రత్యక్ష ప్రసారం కూడా అందించారు.

విద్యార్థులకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని మంత్రి లోకేష్ గతంలో అసెంబ్లీలో ప్రతిపాదించడంతో ఇది అమల్లోకి వచ్చింది.
అసెంబ్లీని పోలిన ప్రత్యేక సెట్‌లో సాగిన ఈ మాక్ సెషన్‌లో ఒలింపిక్స్ అంశంపై అధికార–ప్రతిపక్ష పాత్రలు పోషించిన విద్యార్థుల మధ్య చర్చ ఉత్కంఠభరితంగా మారింది.

ఒక దశలో ప్రతిపక్ష పాత్రధారులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేయడంతో మార్షల్స్ జోక్యంవహించి కొందరిని బయటకు తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధుల అసలు సభలలో కనిపించే పరిణామాలను ఈ చిన్నారులు అచ్చం ప్రతిబింబించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
