AIADMK MLAs resigning: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి వరుసగా షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా తన పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంబసముద్రం ఎమ్మెల్యే ఎసాక్కీ సుబాయా అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం.
ఇతను త్వరలోనే టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల ఎమ్మెల్యేలు మరగాథం, సత్యభామ, జయకుమార్ కూడా తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు నేతలు స్పీకర్‌ను కలిసి అధికారికంగా రాజీనామా లేఖలు సమర్పించారు.
తరువాత వీరు టీవీకే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆదవ్ అర్జునను కలిసినట్లు సమాచారం. ఆయన సమక్షంలోనే త్వరలో టీవీకే పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పార్టీ మారే ఉద్దేశంతోనే ఈ నేతలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన కీలక పరిణామాల సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే విప్‌ను ధిక్కరించి టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఆ తర్వాత అనర్హత వేటు పడకుండా ఉండేందుకే ముందస్తుగా రాజీనామాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక త్వరలో జరిగే ఉపఎన్నికల్లో ఈ మాజీ ఎమ్మెల్యేలు తిరిగి టీవీకే పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.








