Abhishek Sharma: టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ప్రదర్శన తీవ్ర చర్చకు దారితీసింది. సూపర్-8 దశలోవెస్టిండీస్ తో జరిగిన కీలక పోరులో ఆయన బ్యాటింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ నిరాశపరిచారు.
సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాల్సిన మ్యాచ్‌లో చేసిన తప్పిదాలు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.
196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్‌గా దిగిన అభిషేక్ కేవలం 11 బంతుల్లో 10 పరుగులకే పరిమితమయ్యారు. సాధారణంగా దూకుడుగా ఆడే ఆయన ఈసారి నెమ్మదైన ఇన్నింగ్స్ ఆడటంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది. రన్‌రేట్ తగ్గిపోవడంతో మధ్యవరుసపై భారం పడింది.
ఫీల్డింగ్‌లోనూ కీలక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) బౌలింగ్‌లో రోస్టన్ చేజ్ ఇచ్చిన సులభ క్యాచ్‌ను వదిలేయగా, చివరి ఓవర్లలో అర్షదీప్ సింగ్(Arshdeep Singh) బంతిపై రోవ్‌మన్ పావెల్ ఇచ్చిన మరో అవకాశాన్ని కూడా చేజార్చుకున్నారు.
ఈ రెండు అవకాశాలు కలిపి దాదాపు 40 పరుగుల నష్టానికి దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో విండీస్ భారీ స్కోరు నమోదు చేసింది.
మైదానంలో జరిగిన ఈ తప్పిదాలపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శల వర్షం కురుస్తుండగా, కొందరు మాత్రం త్వరలోనే బలమైన పునరాగమనంతో జట్టుకు కీలకంగా మారాలని అభిషేక్‌కు మద్దతు తెలుపుతున్నారు.








