అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల కోసం ప్రముఖ సంస్థల సీఈఓలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన ఆయన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరెక్టర్ రేచల్ స్కాఫ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను సూచిస్తూ, క్లౌడ్ సేవలు, ఏఐ, మిషన్ లెర్నింగ్ ద్వారా రాష్ట్రం డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు ఏడబ్ల్యూఎస్‌తో భాగస్వామ్యం ముఖ్యమని పేర్కొన్నారు.
రెవేచర్ సీఈఓ అశ్విన్ భరత్‌తో భేటీ సందర్భంగా, లోకేశ్ రాష్ట్రంలో టెక్ టాలెంట్ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపనకు రెవేచర్ భాగస్వామ్యం అవసరమని చెప్పారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డిమాండ్ ఉన్న ఐటీ నైపుణ్యాలపై యువతకు శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలిసి కోడింగ్ బూట్ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ-గవర్నెన్స్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లలో సాంకేతిక నైపుణ్యాలుగా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు మద్దతు ఇవ్వాలన్నారు.
స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలకమని నారా లోకేశ్ తెలిపారు. ఈ-గవర్నెన్స్, పబ్లిక్ సర్వీసెస్ మెరుగుదలకు అధునాతన క్లౌడ్ సొల్యూషన్స్ ద్వారా ఏపీలో సాంకేతిక మార్పులు సాధ్యమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.