దేశ విద్యారంగానికి విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త, మాజీ గవర్నర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ డి.వై. పాటిల్(Dr DY Patil Passes Away) ఇక లేరు. త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా సేవలందించిన ఆయన.. 182కుపైగా విద్యాసంస్థలను స్థాపించి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు. వయోభారంతో ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఆయన తుదిశ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా రాజకీయ, విద్యా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, డి.వై. పాటిల్ విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 1935 అక్టోబర్ 22న జన్మించిన డి.వై. పాటిల్ విద్యా రంగంలో విశేష కృషి చేశారు. ఆయన స్థాపించిన డి.వై. పాటిల్ గ్రూప్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉన్నత విద్య, వైద్య విద్య అభివృద్ధికి ఆయన చేసిన సేవలు ప్రత్యేక గుర్తింపు పొందాయి.
రాజకీయ జీవితంలో మహారాష్ట్ర శాసనసభ్యుడిగా సేవలందించిన ఆయన, 2009 నుంచి 2013 వరకు త్రిపుర గవర్నర్గా పనిచేశారు. అనంతరం బిహార్, పశ్చిమ బెంగాల్ గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. విద్యా రంగానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసింది. ఆయన మరణంతో విద్యా, ప్రజాసేవ రంగాలు ఒక విశిష్ట వ్యక్తిత్వాన్ని కోల్పోయాయి.
ALSO READ: Ajit Agarkar | షమీ రీఎంట్రీ ఎప్పుడు?.. సెలెక్టర్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు








