Kishan Reddy: వికసిత భారత్ నిర్మాణానికి గ్రీన్ మొబిలిటీ, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ కీలకమైనదని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కీటో మోటార్స్ తొలి ఎలక్ట్రిక్ బస్సుతో పాటు ఇథనాల్ ఆధారిత విద్యుత్ జనరేటర్‌ను ప్రారంభించిన ఆయన, తయారీ రంగం, గ్రీన్ ఎనర్జీ, ఇన్నోవేషన్‌లో భారత్ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోందని పేర్కొన్నారు. అరుదైన ఖనిజాల్లో దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 73 శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గుపైనే ఆధారపడి ఉందని, దీనిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్, తెలంగాణలో ఉపరితల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఇంధన రంగంలో రూ.1 లక్ష కోట్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
టీజీఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం 1,050 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, కేంద్ర పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మరో 2,200 ఈవీ బస్సులు త్వరలో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10న సాధారణ పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.1,09,019 కోట్ల పన్నుల వికేంద్రీకరణ నిధులను రాష్ట్రాలకు విడుదల చేయనుండగా, తెలంగాణకు అదనంగా రూ.2,370 కోట్లు కేటాయిస్తున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నిధులు రాష్ట్రంలో మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుకు దోహదపడతాయని ఆయన తెలిపారు.
ALSO READ: Prashant Kishor | బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిషోర్ సంచలనం.. తొలి ఎన్నికలోనే ఘన విజయం








