TTD Accounting Reforms: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. శుక్రవారం నుంచి పెరిగిన భక్తుల సంఖ్య ఈ నెలాఖరు వరకు కొనసాగవచ్చని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ఇప్పటికే క్యూ లైన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. వసతి గదుల కేటాయింపులోనూ సాంకేతికతను వినియోగిస్తూ సేవలను మరింత వేగవంతం చేసే చర్యలు చేపట్టింది.
తాజాగా మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత అకౌంటింగ్ విధానంలోనూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. టీటీడీ ఆర్థిక వ్యవహారాలను ఆధునీకరించేందుకు ICAI సమగ్ర సమీక్ష ప్రక్రియను చేపట్టింది. నూతన అకౌంటింగ్ నిబంధనలకు అనుగుణంగా సవరించిన అకౌంటింగ్ మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది. ప్రస్తుతం టీటీడీలో ఈఆర్‌పీ ఆధారిత సమగ్ర అకౌంటింగ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ, దానిని మరింత మెరుగుపరిచేందుకు ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
కొత్త పద్ధతి ద్వారా శ్రీవారి ఆలయానికి వచ్చే విరాళాలు, ఆదాయ వనరులు, వ్యయాలు, ఆస్తుల పరిరక్షణ, ఆర్థిక లావాదేవీల వివరాలను మరింత స్పష్టంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్థిక నియంత్రణను బలోపేతం చేయడమే ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం. 30 ఏళ్ల నాటి అకౌంటింగ్ విధానానికి ఆధునిక రూపం తీసుకురావడంపై టీటీడీ దృష్టి సారించింది.
ALSO READ: Karnataka Cabinet Expansion | డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణ.. యువత, మైనారిటీలకు పెద్దపీట








