Flipkart Food Delivery: దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో(Swiggy and Zomato) ఆధిపత్యం కొనసాగుతున్న ఈ రంగంలో కొత్త పోటీకి తెరలేపుతూ బెంగళూరులో తొలి దశ సేవలను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ నెల 15లోగా ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సేవల ప్రారంభానికి ముందుగానే బెంగళూరులోని రెస్టారెంట్లను ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చుకునే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఇతర ఫుడ్ డెలివరీ(Food Delivery) సంస్థలతో పోలిస్తే కేవలం 10 శాతం కమిషన్ మాత్రమే వసూలు చేయనున్నట్లు తెలుస్తుండటంతో రెస్టారెంట్ యజమానుల నుంచి మంచి స్పందన లభించే అవకాశముంది. ఈ-కామర్స్ రంగంలో దేశవ్యాప్తంగా విస్తృత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్న ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే క్విక్ కామర్స్ విభాగంలో కూడా అడుగుపెట్టింది. బ్లింకిట్, జెప్టో వంటి సంస్థలకు పోటీగా కిరాణా సరుకులు, రోజువారీ అవసరాల వస్తువులు, మాంసాహార ఉత్పత్తులను కూడా వేగంగా డెలివరీ చేస్తోంది. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించడం ద్వారా వినియోగదారులకు ఒకే యాప్‌లో షాపింగ్, గ్రోసరీ, మాంసం, ఆహార ఆర్డర్ల సౌకర్యాన్ని కల్పించాలని సంస్థ భావిస్తోంది. ఈ కొత్త వ్యూహం భారత ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో పోటీని మరింత ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Hyderabad Metro | ప్రాణాలను కాపాడిన హైదరాబాద్ మెట్రో.. గ్రీన్ ఛానెల్‌తో 25 నిమిషాల్లో అవయవాల తరలింపు








