CP Sajjanar: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ (CP), వి.సి. సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను ప్రత్యక్షంగా సమీక్షించిన ఆయన, ప్రజల ప్రయాణాలకు అంతరాయం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. వర్షాల కారణంగా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సజ్జనార్ హెచ్చరించారు. నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలు, ఫ్లైఓవర్లపై వాహనదారులు వేగాన్ని తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుగానే ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితులు లేదా ట్రాఫిక్ సమస్యలు ఎదురైతే వెంటనే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా వేదికల ద్వారా జారీ చేసే అడ్వైజరీలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.








