అత్యాధునిక సాంకేతికత మరోసారి ఓ వ్యక్తికి ప్రాణదాతగా నిలిచింది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రానికి చెందిన మహమ్మద్ ఇస్లాం ప్రాణాలను ఆపిల్ వాచ్(Apple Watch) సమయానికి అందించిన అత్యవసర సహాయం కాపాడింది. అస్వస్థత కారణంగా పనికి సెలవు తీసుకున్న ఆయన ఇంటి బయట చెత్త వేయడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన ఆయన లేవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. కష్టంగా దగ్గర్లోని కుర్చీని పట్టుకుని కూర్చున్న సమయంలో అంబులెన్స్ సైరన్ శబ్దాలు వినిపించడంతో ఆశ్చర్యపోయారు.
అనంతరం తన ఆపిల్ వాచ్ స్వయంగా 911 అత్యవసర సేవలకు సమాచారం పంపిందని తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టినట్లు (Blood Clots) గుర్తించారు. వెంటనే చికిత్స అందడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమయానికి స్పందించిన ఆపిల్ వాచ్ లేకపోతే పరిస్థితి మరింత విషమించేదని ఇస్లాం తెలిపారు. ఆపిల్ వాచ్ సిరీస్ 4 నుంచి వచ్చిన మోడళ్లలో, SE, అల్ట్రా వేరియంట్లలో అందుబాటులో ఉన్న Fall Detection ఫీచర్ తీవ్రమైన పతనాన్ని గుర్తిస్తుంది. వ్యక్తి ఒక నిమిషం పాటు స్పందించకపోతే, అది ఆటోమేటిక్‌గా అత్యవసర సేవలకు కాల్ చేసి, వినియోగదారి లొకేషన్‌తో పాటు అత్యవసర కాంటాక్ట్‌లకు కూడా సమాచారం పంపుతుంది. 55 ఏళ్లు పైబడిన వినియోగదారులకు ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ఘటనతో అత్యవసర పరిస్థితుల్లో ధరించే స్మార్ట్ పరికరాల ప్రాముఖ్యత మరోసారి రుజువైంది.
ALSO READ: Nara Lokesh | పత్తికొండలో భారీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శ్రీకారం








