Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. బాచుపల్లి, కుతుబుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, మేడ్చల్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్‌పల్లి, గుండ్లపోచంపల్లి, హకీంపేట్, షామీర్‌పేట్, తూర్కపల్లి, కండ్లకోయ, బౌరంపేట్, మల్లాంపేట్ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాల్సిన ప్రాంతాలుగా గుర్తించారు.
ఇప్పటికే కుతుబుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్, మేడ్చల్, బాచుపల్లి పరిసరాల్లో వర్షం ప్రారంభమైంది. ఈ ప్రభావం క్రమంగా హైదరాబాద్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. సాయంత్రం సమయానికి వర్ష తీవ్రత మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయాలు, నీటిమునిగే ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
ALSO READ: Revanth Reddy | కబ్జాకోరులకు సీఎం వార్నింగ్.. హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదు








