సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Bombay High Court) బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానం వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడుతున్నారంటూ డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గడ్కరీ తన పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని, ఆ విధాన రూపకల్పన లేదా అమలులో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య సమాచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులను ప్రచారం చేసిన మెటా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సంబంధిత నిర్వాహకులపై సివిల్ దావా వేయేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.
పిటిషన్‌ను పరిశీలించిన బొంబాయి హైకోర్టు ఆయన అభ్యర్థనకు అనుమతి మంజూరు చేసింది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ కంటెంట్‌పై చట్టపరమైన పోరాటానికి ఈ నిర్ణయం కీలకంగా మారగా, సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారం చేసే వారిపై మరింత బాధ్యత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: Stock Market Today | నష్టాల నుంచి లాభాల బాట.. మార్కెట్లో ఒక్కరోజే భారీ మార్పు








